మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

బాంబు పేల్చిన జియో.. ఉచితం లేదు.. గిచితం లేదు!

Updated: 27-09-2017 08:52:30

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో బాంబు పేల్చింది. నిన్నమొన్నటి వరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పిన జియో ఇప్పుడు ఏడాదికి రూ.1500 చొప్పున చచ్చినట్టు రీచార్జ్ చేయించాల్సిందేనని అంటోంది. అంటే మూడేళ్లలో రూ.4500 చేయిస్తేనే ఫోన్ వినియోగదారుల వద్ద ఉంటుంది. లేదంటే ఫోన్ తిరిగి లాక్కోవడమే కాదు.. ఎదురు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. 
 
రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం 60 లక్షల మంది ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. రెండుసార్లు వాయిదా పడిన ఫోన్ల డెలివరీ ఎట్టకేలకు ఈనెల 21 నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. తొలుత ఈ ఫోన్ ఉచితమని ముకేశ్ అంబానీ ప్రకటించారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లిస్తే మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామన్నారు. అయితే ఇప్పుడేమో ఏడాది రూ.1500 చొప్పున రీచార్జ్ చేసుకోవాల్సిందేనని జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జియో ఫోన్ అందుకున్నప్పటి నుంచి ఏడాదికి రూ.1500 చొప్పున మూడేళ్లపాటు రీచార్జ్ చేసుకోవాలి. ఒకవేళ వినియోగదారుడు నిబంధనల ప్రకారం రీచార్జ్ చేయకుంటే ఫోన్‌ను వెనక్కి తీసుకునే హక్కు కంపెనీకి ఉంది. అంతేకాదు.. మూడేళ్ల కంటే ముందే వినియోగదారుడు ఫోన్‌ను వెనక్కి ఇచ్చేసినా వినియోగదారుడు ఎదురు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది లోపే ఫోన్‌ను వెనక్కి ఇచ్చేస్తే కంపెనీ నుంచి పైసా కూడా రాదు. అంతేకాక వినియోగదారుడే తిరిగి రూ.1500తోపాటు జీఎస్టీ, ఇతర పన్నుల కింద మరికొంత చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటి రెండేళ్ల లోపు ఇచ్చేస్తే రూ.1000తోపాటు జీఎస్టీ, ఇతర పన్నుల కింద అదనంగా మరికొంత సమర్పించుకోవాలి. రెండేళ్ల దాటి మూడేళ్లలోపు ఫోన్‌ను వెనక్కి ఇచ్చేస్తే రూ.500, జీఎస్టీ, ఇతర పన్నులు కంపెనీకి చెల్లించాలి. అంటే మూడేళ్ల నిబంధన పూర్తయిన తర్వాత మాత్రమే వినియోగదారుడు సెక్యూరిటీ కింద చెల్లించిన రూ.1500లను కంపెనీ వెనక్కి ఇస్తుంది. ఇదన్న మాట.. రిలయన్స్ జియో ఉచిత స్టోరీ! 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.