మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

జియో క్రిడెట్ మా అమ్మాయిదే: ముకేశ్ అంబానీ

Updated: 17-03-2018 06:56:32

టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్-ఆర్సెలార్ మిట్టల్ బోల్డ్‌ెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్’ కార్యక్రమంలో ‘డ్రైవర్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు అందుకున్న అంబానీ మాట్లాడుతూ.. జియో పురుడుపోసుకోవడం వెనక ఉన్న కథను వెల్లడించారు.
 
‘‘అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో చదువుతున్న మా అమ్మాయి ఇషా 2011లో ఇంటికొచ్చింది. ఓసారి తన ప్రాజెక్టు వర్క్‌ను నెట్ ద్వారా సమర్పించేందుకు కంప్యూటర్ ఆన్ చేసింది. నెట్ చాలా స్లోగా ఉండడంతో ఆ విషయాన్ని నాకు చెప్పింది. అక్కడే ఉన్న ఇషా సోదరుడు ఆకాశ్ వెంటనే స్పందిస్తూ అప్పట్లో వాయిస్ కాల్స్ ద్వారా టెలికం కంపెనీలకు డబ్బులొచ్చేవి. ఇప్పుడంతా డిజిటల్. ఇక భవిష్యత్తు అంతా బ్రాండ్‌బ్యాండ్‌దే అన్నాడు. ఈ టెక్నాలజీని భారత్ మిస్ కాకూడదని నాతో అన్నారు. వారి మాటలతో నాకూ ఓ ఆలోచన తట్టింది. జియో స్థాపనకు అలా నాందిపడింది’’ అని ముకేశ్ వివరించారు. అతి తక్కువ ధరకే దేశంలోని అందరికీ అత్యంత నాణ్యమైన వాయిస్ కాల్స్‌తోపాటు డేటాను జీవితాంతం అందించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు 5జీ సేవలకు కూడా సిద్ధమవుతున్నట్టు అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం రిలయన్స్ జియో 4జీ ఎల్‌టీఈ లో అతిపెద్ద డేటా నెట్‌వర్క్ కలిగి ఉందని చెప్పిన అంబానీ వచ్చే ఏడాది నాటికి భారత్ 4జీ సేవల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అవుతుందని జోస్యం చెప్పారు. రెండేళ్ల క్రితం డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో 155వ స్థానంలో ఉంటే జియో రాకతో ప్రస్తుతం నంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్టు అంబానీ వివరించారు. 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.