ఆఫర్‌ను పొడిగించిన జియో
Updated:
01-10-2017 10:07:15
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన జియో-ఫై ఆఫర్‌ను మరికొంత కాలం పొడిగించింది. ఈ ఆఫర్ ఈనెల 30తో ముగియగా పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను పొడిగించినట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే పొడిగింపు ఎప్పటి వరకు అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
జియో-ఫై అసలు ధర రూ.1999 కాగా దానిని సగం ధరకే అంటే రూ.999కే అందిస్తున్నట్టు ప్రకటించింది. 4జీ వై-ఫై పరికరాన్ని ఉపయోగించి 2జీ, 3జీ ఫోన్లలోనూ 4జీ వీవోఎల్టీఈ సేవలు పొందే వీలుంది. అంతేకాక ఉచితంగా వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇందుకు 4జీ వాయిస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో-ఫైతో పది స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, కంప్యూటర్లను పది వరకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులోని 2300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆరు గంటల పాటు పనిచేస్తుందని జియో వివరించింది.