సిక్స్ కొట్టి స్కోరు బోర్డును చెల్లాచెదురు చేసిన పూజ
Updated:
16-03-2018 08:59:39
వడోదర: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనా టీమిండియా బ్యాట్స్ విమెన్ పూజ బాదిన సిక్సర్ మాత్రం క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడీ సిక్సర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. అనంతరం 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కాగా, 40వ ఓవర్లో ఆసీస్ బౌలర్ జెస్ జోనసెస్ వేసిన బంతిని టీమిండియా బ్యాట్స్ విమెన్ పూజ బలంగా కొట్టింది. ఆ దెబ్బకు బంతి బౌండరీ లైన్ దాటి స్కోరు బోర్డుకు తాకడంతో అది చెల్లాచెదురైంది. దానిపైన అంకెలు కిందపడ్డాయి. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈలలు వేస్తూ హుషారెత్తించారు. బౌలర్ జెస్ కూడా పూజను చూసి నవ్వింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.