మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

వెంకయ్య రాజీనామా పుకారే!.. రాజ్యసభ చైర్మెన్‌గా విధులకు హాజరు

Updated: 09-03-2018 11:22:11

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు రాజీనామా చేస్తున్నారనేది ఉత్తి పుకారేనని తేలిపోయింది. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా చేస్తున్నారంటూ ఓ వెబ్‌సైట్ వార్త ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉపరాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించగా ఇది ఉత్తి పుకారేనని తేలిపోయింది. పైగా ఇవాళ రాజ్యసభ చైర్మెన్ హోదాలో వెంకయ్య హాజరయ్యారు. సభను నడిపించారు కూడా. ఈ నేపథ్యంలో పుకార్లకు చోటివ్వరాదని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
 
ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా ఏపీ కేబినెట్ నుంచి బిజెపి మంత్రులు, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు రాజీనామాలు చేశారు. అయితే ఎన్డీయేలోనే కొనసాగుతామని టీడీపీ స్పష్టం చేసింది.
 
ఏపీ విభజన సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అయితే ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యారు. అయితే మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా అదే స్థాయిలో ఏపీకి ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటించింది. దీనికి టీడీపీ ప్రభుత్వం కూడా సరేనంది. అయితే అమలులో జాప్యాన్ని నిరసిస్తూ టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.
 
ఓ వైపు ఇలాంటి పరిణామాలతో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యను రాజీనామా చేయించి క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించేలా తీసుకురావాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని, ఆయనతో రాజీనామా చేయించనుందంటూ ఆ వెబ్‌సైట్ కథనం రాసింది. దక్షిణాదిలో బిజెపి బలపడటానికి, టిడిపి, టిఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను దారిలో పెట్టడానికి వెంకయ్య సారథ్యమే సరని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ కథనం రాసింది.
 
అయితే ఇది ఉత్తి పుకారేనని తేలిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం ఉండదని, వెంకయ్య హుందాగా వ్యవహరిస్తూ సభ ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.