మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

సంచలనం.. తొలిసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్

Updated: 09-03-2018 08:07:13

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమావేశం కాబోతున్నారు. దక్షిణకొరియా భద్రతా సలహాదారు చుంగ్ యంగ్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసి ఈ విషయం చెప్పారు. కిమ్ జోంగ్ మనసులో ఉన్న మాటను అధికారికంగా యంగ్ వెల్లడించారు. ట్రంప్‌తో సమావేశం కావాలని కిమ్ అనుకుంటున్నారని చెప్పారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు. మే నెలలోగా కిమ్‌తో సమావేశమౌతానని ట్రంప్ చెప్పారు. దీంతో ఉప్పు-నిప్పులా ఉండే అమెరికా, ఉత్తరకొరియాల మధ్య అధికారిక స్థాయిలో తొలిసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు వారిస్తున్నా వినకుండా అణ్వస్త్ర పరీక్షలు జరిపిన ఉత్తరకొరియాపై ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వస్త్ర పరీక్షలు జరపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో అణు యుద్ధం తప్పదేమో అన్నంతగా ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ సమావేశాలు తోడ్పడ్డాయి. ఈ సమావేశాల తర్వాత కిమ్ జోంగ్ అమెరికా అధ్యక్షుడితో సమావేశం కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో అతి త్వరలో జరగబోయే ఈ సమావేశం ద్వారా ఉత్తరకొరియాలో పరిస్థితులు మెరుగుపడి ఉద్రికత్తలు మరింత తగ్గొచ్చని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.  

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.