పవన్ విమర్శలపై బోండా ఉమ ఏమన్నారంటే!
Updated:
15-03-2018 10:28:58
అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. శేఖర్ రెడ్డి అవినీతి కేసులో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉన్నారని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, సాక్ష్యాలు చూపించాలని కోరారు. కోట్ల సంపాదన వదులుకుని లోకేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారని ఉమ చెప్పారు. రాజధానికి రెండు వేల ఎకరాలు సరిపోతాయని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదన్నారు. బిజెపి కుడిపైపు వైసీపీని, ఎడమవైపు జనసేనను పెట్టుకుని టీడీపీ సర్కారును ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోందని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు భావిస్తున్నారని బోండా ఉమ చెప్పారు. సమర్థుడైన చంద్రబాబు చేతిలో ఏపీ అభివృద్ధి చెందుతోందని నాలుగేళ్లుగా ప్రశంసలు కురిపించి నేడు అకస్మాత్తుగా టీడీపీ సర్కారుపై ఆరోపణలు చేశారని బోండా ఉమ ప్రశ్నించారు. బీజేపీ వెనకుండి కథ నడిపిస్తోందని ఉమ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో, రాష్ట్రానికి ఏం రావాలో ఏనాడైనా ప్రధానమంత్రితో మాట్లాడారా అని బోండా ఉమ పవన్‌ను ప్రశ్నించారు. నిన్నటి సభలో మోదీని పల్లెత్తు మాట కూడా ఎందుకు అనలేదని ఉమ ప్రశ్నించారు. పవన్ నిన్నటి స్పీచ్‌లో చంద్రబాబు, నారా లోకేశ్‌పై విమర్శలు చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.