మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

2019 కలవరపాటులో చంద్రబాబు తప్పటడుగులు!

Updated: 13-02-2018 10:37:21

చిదంబరం డిశంబర్ 9 వతేదీ ప్రకటనతోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తథ్యం అనే విషయం అర్ధం అయ్యింది. ఆనాడు ప్రభుత్వ, ప్రతిపక్షంలో ఉన్న సీమాంధ్ర నాయకులు ఈరోజులాగానే ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్ మీద ఉన్న మమకారంతో ఆడుకున్నారనే చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఆదాయ వనరు. 1956 నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావటంవల్ల సీమాంధ్ర 13 జిల్లాలనుంచి ప్రజలు వారి వారి వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవసరాలకోసం హైదరాబాద్‌లో స్థిరపడిపోయారు. ఇక్కడ ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా హైదరాబాద్లో బోలెడన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ లక్షలమందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీమాంధ్ర రాజకీయ నాయకులు 2009-2014 మధ్యకాలంలో తాము రాష్ట్ర విభజనకు అడ్డుపడి విభజన ఆపుతాము అని అన్నారే కానీ విభజన జరిగితే సీమాంధ్రకు కావలసిన అంశాల మీద దృష్టి పెట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పొచ్చు. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొడతా అని ఒకరు, తుఫాన్‌ను ఆపలేకపోయా.. విభజన ఆపుతా అని మరొకరు, రెండు కళ్ళు సమన్యాయం అంటూ మరికొందరు ఏ విషయంలోనూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా రెండు ప్రాంతాల నాయకులను ఉద్యమాలు చేయమని ఉసిగొల్పారు. కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణా విభజనకు పూర్తి మద్దతు తెలియజేస్తూ విభజన ద్వారా ఆర్ధికంగా నష్టపోతున్న సీమాంధ్ర ప్రదేశ్‌ను ఆదుకోవటం కోసం విభజన బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించటం రాజ్యసభలో ఆనాటి ప్రధాని ద్వారా ప్రత్యేక హోదా ప్రకటన చేయించటం చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. విభజన బిల్లు రెండు సభలలో ఆమోదం కావటమూ చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడటమూ ఎన్నికల ప్రక్రియ మొదలు కావటమూ జరిగిపోయింది. 
 
 
తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో నూతన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి వైపు మొగ్గు చూపారు. కారణం చంద్రబాబు నాయుడికి ఉన్న పరిపాలనా అనుభవం మరియూ అప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ వల్ల ఖచ్చితంగా బిజెపి అధికారంలోకి వస్తుందని, మోదీ, చంద్రబాబు ఇద్దరి నాయకత్వంలో విభజన గాయాలనుంచి త్వరగా రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తారని ప్రజలు విశ్వసించారు. అన్నిరంగాల్లో ముందుకు తీసుకొనివెళ్ళగలరు అనే ప్రగాడ విశ్వాసం ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయటం వల్ల, కులసమీకరణాలు మారటం వల్ల కూడా తెలుగుదేశం విజయానికి కారణమయ్యాయి. విభజన వల్ల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. భావోద్వేగాలవల్ల విడిపోవటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్ లాంటి కీలక అంశాల్లో చంద్రబాబు దృష్టిపెడతారని, తమ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక పరిశ్రమలను, ఐటి కంపెనీలను తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధిపధంలోకి తీసుకెళ్తారని ఆశించారు. అలా ఆశించటమూ తప్పుకాదు, 
 
 
కానీ 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి, 1999-2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఎక్కడ కూడా పోలిక లేని విధంగా ఆయన పాలన ఈ నాలుగేళ్ళకాలంలో సాగింది. 99-04ల మధ్య చంద్రబాబు ఏ విషయంలోనూ రాజీపడరు అని, అధికారులతో సమర్ధవంతంగా పని చేయించుకోగలరు అని పేరు ఉండేది. కానీ ఈ  టర్మ్‌లో చంద్రబాబు నాయుడి పాలన గాడి తప్పిందనే చెప్పక తప్పదు. ఆర్ధికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సరైన దిక్సూచి చూపించాల్సిన సమయంలో రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టక 2014 నుంచే 2019లో తిరిగి ఎలా గెలిచి అధికారంలోకి రావాలనే విషయంపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టుకోల్పోవడం వల్ల రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు మాయని మచ్చగా మిగిలిపోయాయి. గోదావరి పుష్కరాల్లో 29 మంది దుర్మరణం, కాల్ మనీ, యంఆర్‌వో వనజాక్షి విషయంలో ఆయన తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇక్కడనుంచి పాలన కొనసాగిస్తూ నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మాణానికి అడుగులు వేయాల్సిన తరుణంలో హైదరాబాద్ వదిలి అమరావతి వెళ్లారు. ఇక అమరావతి రాజధాని విషయంలో నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక స్పష్టమైన విధానం లేక విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ తానొక నగరానికి సృష్టికర్తను అనే భావనలో ఉండి ఇటు తనపార్టీ వారిని, ప్రభుత్వ అధికారులను, ప్రజలను చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అయోమయానికి గురిచేసారని చెప్పక తప్పదు. ఒకసారి సింగపూర్, మరోసారి జపాన్, మలేషియా, చైనా ఇలా అనేక దేశాల్లో పర్యటించారు. అమరావతి కోసం 33 వేల ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఏ నగరం అయినా కూడా రాత్రికి రాత్రే అద్భుతమైన నగరంగా రూపొందదు అనే వాస్తవాన్ని తొలుత గ్రహించలేకపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌కు పొరుగున ఉన్న చత్తీస్ ఘడ్ రాజధాని నయా రాయపూర్‌లా ఒక చక్కటి రాజధాని 10 ఎకరాల్లో నిర్మాణం మొదలు పెట్టి ఉన్నట్లైతే ఈపాటికి 50% పనులు పూర్తి అయ్యేవి. గాంధీనగర్ కూడా మనదేశంలో ఒక మోడల్‌గా ఉంది. చంఢీ‌ఘర్ కూడా మంచి రాజధాని నగరమే.  
 
ఇక పోలవరం విషయంలో మొదటినుండీ అంతా అయోమయమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పట్టిసీమకు మరలించడం, నదుల అనుసంధానం అనటమూ,  కాంట్రాక్టర్లను మార్చటం అనేక వివాదాల్లోకి వెళ్ళిపోయింది. చివరకు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించటమూ, ఎదుటి పార్టీ యం‌యల్‌‌ఏ‌లను తన మంత్రి వర్గంలో కొనసాగించటమూ కూడా రాజకీయంగా భవిష్యత్తులో ఆయనకు మచ్చ తెచ్చేదే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2014 ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడి ధోరణి మొదట నుంచీ అనుమానాస్పదంగానే ఉంది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు బంద్ చేస్తున్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలసి ప్రత్యేక హోదా కంటే కూడా మాకు ప్రత్యేక ప్యాకేజి కావాలి అని కొన్ని నివేదికలు తయారుచేయించి, కేంద్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్‌కి సమర్పించి వారిచేత ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ప్రకటన చేయించుకున్నారు. అసెంబ్లీ‌లో ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్యాకేజి వల్ల రాష్ట్రానికి లాభం అని, తన వల్ల కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి అని ప్రతిపక్షం మీద ఎదురుదాడికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2015 నుండి 2017 వరకు కూడా ఆయన పాల్గొన్న ప్రతి సభలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇతోధిక సహాయం అందిస్తుంది, దీనివల్ల ఆంధ్ర ప్రదేశ్ అన్నిరంగాల్లో అభివృద్ధి పధంలో దూసుకెళ్తుంది అని ప్రకటనలు గుప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 
మారిన రాజకీయ పరిస్థితులు ..పాలనా పరమైన వైఫల్యాలు పార్టీ గాడితప్పటం 2014లో ఇచ్చిన అనేక ఎన్నికల హామీలను తీర్చలేకపోవటం ఉద్యోగాలకల్పనలో పూర్తిగా వెనుకబడటం నాలుగేళ్ళయినా రుణమాఫీ ఇంకా పూర్తిగా అమలు కాకపోవటంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో కొంత సఖ్యత చెడిపోవటమూ, మరోవైపు ప్రతిపక్షనేత వైయస్ జగన్ పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉండటమూ, పోలవరం, రాజధాని నిర్మాణాల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ అడగటమూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడటమూ మరోవైపు దేశంలో నరేంద్రమోడీకి పెరుగుతున్న ప్రజాదరణ భారతీయ జనతాపార్టీ అనేక రాష్ట్రాల్లో అప్రహతితంగా గెలుస్తూ రావడమూ, ఇలా బిజెపి దేశంలో బలపడితే గతంలోలాగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కీలక స్థానంలో ఉండలేవేమో అనే ఆలోచనలు వచ్చినట్లే తెలుస్తోంది. కొన్ని కారణాలు బయటకు రాకపోయినప్పటికీ ప్రధాని మోదీ చంద్రబాబుకు సుమారు ఒక సంవత్సరం నుంచి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వై‌యస్ జగన్‌ను కలవటమూ వచ్చే ఎన్నికల్లో వై‌యస్ జగన్, బిజెపి కలసి పోటీ చేస్తాయేమో అనే సంశయంలో ఉండటమూ ఇలా అనేక కారణాల వల్ల కలత చెందిన చంద్రబాబు నాయుడు మళ్ళీ తృతీయ ఫ్రంట్ పేరున అందరినీ కలిసే పని ప్రారంభం చేశారు. అదికూడా ఒక కొలిక్కి రాకపోవటంతో ప్రజలు ఇప్పుడు తృతీయ ఫ్రంట్ లాంటి ప్రత్యామ్న్యాయ రాజకీయ పక్షాలను ఆదరించే మూడ్ లేకపోవటంతో బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు సరిగా నిధులు కేటాయించలేదు అనే నెపంతో ప్రజల్లో మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టేపనిలో పడిపోయారు. 
 
 
ఫిబ్రవరి 1 వతేదీ నుంచి చంద్రబాబు, ఆయన పార్టీ తన వైఫల్యాలన్ని కప్పిపుచ్చుకొనే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ప్రచారం చేశారు. ఈ నాలుగేళ్ళు తమకు ఇస్తామన్న నిధులు ఇవ్వలేదని, తాము కేంద్ర ప్రభుత్వానికి నమస్కారం పెట్టి తప్పుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో పడిపోయారు. నాలుగు రోజుల పాటు తెలుగుదేశం యంపీలు లోక్‌సభలో చేసిన హంగామా దీనికి నిదర్శనం. కేంద్రంలో చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు సభ్యులు మంత్రులుగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్ ఆమోదంలో వారి పాత్ర కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాస్తవాలను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతాపార్టీని ప్రజల్లో బూచిగా చూపెట్టే ప్రయత్నం ప్రారంభించారు. చివరకు వీరు ఎక్కడివరకూ వెళ్ళిపోయారంటే లోకసభలో ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల విషయంలో 10 నిమిషాలు మాట్లాడిన గుంటూరు యంపి గల్లా జయదేవ్‌ను ఒక యుద్ధ వీరునిగా కీర్తిస్తూ పాలాభిషేకాలు, సన్మానాలు చేయటం ప్రారంభం చేశారు. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలో ఆలస్యం జరిగినా కూడా వాటిని తిరిగి తెచ్చుకోవటానికి ఒక పద్ధతి ఉంటుంది. చంద్రబాబు ఆ పద్ధతిలో వెళ్ళకుండా భారతీయ జనతాపార్టీని బ్లాక్ మెయిల్ చేసే మార్గంలో వెళ్తున్నారనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు మీడియాను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు, రెండు సార్లు మోసం చేయొచ్చు కానీ ఎల్లవేళలా మోసం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఉండకపోవచ్చు, ఏదో ఒకసారి తగిన రీతిలో అర్ధం చేసుకొని గుణపాఠం చెప్తారు. 
 
                                                                                   నారపరాజు నరసింగరావు, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్. nnrao1972@gmail.com

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.