మీ దగ్గర పాత ఫోన్ ఉందా? షియోమీ బంపర్ ఆఫర్
Updated:
16-03-2018 08:41:02
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమీ సరికొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తమ వద్ద ఉన్న పాత ఫోన్‌ను తీసుకుని కొత్త ఫోన్‌ను సులభంగా కొనుగోలు చేసుకునేలా ‘ఎంఐ ఎక్స్ఛేంజ్’ పేరుతో ముందుకొచ్చింది. తమ వద్ద ఉన్న పాత మొబైల్ వివరాలను ఎంఐ డాట్ కామ్‌లో నమోదు చేయడం ద్వారా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వచ్చిన డబ్బులను కొత్త ఫోన్ కొనుగోలు చేసుకునే సమయంలో ఉపయోగించుకోవచ్చు.
ఎంఐ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా మొత్తం 15 కంపెనీలకు చెందిన మొబైల్స్‌ను ఐఎం వెనక్కి తీసుకుంటుంది. ఏయే కంపెనీల ఫోన్లను ఎక్స్ఛేంజ్ ద్వారా తీసుకుంటున్నదీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ బ్రాండ్ అందులో లేకుంటే ఈ పథకం వర్తించదు. ఉంటే కనుక వాడుతున్న మొబైల్ మోడల్, ఐఎంఈఐ నంబరు ఎంటర్ చేయాలి. అలాగే టచ్ స్క్రీన్‌పై ఎటువంటి పగుళ్లు లేవని నిర్ధారించాలి. ఆ తర్వాత ఓ కూపన్ కోడ్ వస్తుంది. పాత ఫోన్‌కు చెల్లించే డబ్బులు ఎంఐ ఖాతాలో జమ అవుతాయి. కొత్త ఫోన్ కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ కూపన్ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా కొత్త ఫోన్‌లో ఆ డబ్బులు తగ్గించి మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ డెలివరీ సమయంలో ఎంఐ ఎగ్జిక్యూటివ్‌కు పాత ఫోన్ ఇచ్చేయాల్సి ఉంటుంది.