మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

రాత్రికి రాత్రే రోడ్డును దొంగతనం చేసిన ఘనుడు!

Updated: 03-02-2018 10:52:17

బీజింగ్: దొంగతనానికి ఏదీ అనర్హం కాదనుకున్నాడో దొంగ. డబ్బులు, నగలు, విలువైన సామన్లను ఎత్తుకెళ్లడం పాత ప్యాషన్ అనుకున్నాడో ఏమో! ఏకంగా రోడ్డునే ఎత్తుకెళ్లి అమ్మేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలోని జియంగ్ఝూ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఉదయం లేచి చూసిన సంకేషు గ్రామస్థులు రోడ్డు కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. రోడ్డు కనిపించడం లేదని మొరపెట్టుకున్నారు. దీంతో ఆఘమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డు కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టి ఝూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. 800 మీటర్ల పొడవైన రోడ్డును రాత్రికి రాత్రే తవ్వేసి ఆ మెటీరియల్‌ను కాంక్రీట్ స్టోన్ మెటీరియల్ ఫ్యాక్టరీకి అమ్మేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. డబ్బు సంపాదనకు మరో మార్గం లేకపోవడంతో రోడ్డును తవ్వి కాంక్రీట్‌ను విక్రయించాలనుకున్నానని చెప్పాడు. దీంతో పెద్దగా ఎవరూ వినియోగించని రోడ్డును ఎంచుకుని రాత్రికి రాత్రే దానిని తవ్వేసి ట్రాక్టర్‌లో మెటీరియల్‌ను తరలించినట్టు వివరించాడు. మొత్తం 500 టన్నుల కాంక్రీట్ స్లాబులను తొలగించి 5 వేల యువాన్లు (795 డాలర్లు)కు అమ్మేసినట్టు వివరించాడు. ఇప్పుడీ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదో అద్భుతమైన ఐడియా అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.