మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

ప్రధాని అభ్యర్ధి కేసీఆర్..? 2019లో మోదీ వర్సెస్ కేసీఆర్

Updated: 05-03-2018 01:31:54

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన ఇక జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో సమావేశాలు నిర్వహించనున్నారు. విడతలవారీగా నిర్వహించే ఈ సమావేశాల్లో తొలుతగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో భేటీ అవుతారు. తర్వాత రిటైర్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, న్యాయ నిపుణులతో సమావేశమౌతారు. అన్ని రాష్ట్రాల రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమౌతారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ఆర్ధిక నిపుణులు, కార్యదర్శులతో భేటీ అవుతారు. మీడియా అధినేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల నేతలతో సమావేశమౌతారు.
 
జాతీయ స్థాయి రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలంటూ బిజెపి, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుపై ఇప్పటికే తాను చేసిన ప్రకటనపై అనూహ్య స్పందన వస్తోందని స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు తెలిపారని కేసీఆర్ చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్వాగతించారు. జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సొరేన్ కూడా మద్దతు ప్రకటించారు. 22 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుని మిగతా రాష్ట్రాలపై కన్నేసిన బిజెపిని చూసి మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు ఆందోళనకు గురౌతున్న నేపథ్యంలో ఎస్పీ, బిఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్, ఆర్జేడీ, బిజూ జనతాదళ్ తదితర ప్రాంతీయ పార్టీల నేతలు ఒక తాటిపైకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా పేరున్న సిపిఎం, సిపిఐ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలుగా మారిన నేపథ్యంలో వారి మద్దతు కూడా కేసీఆర్‌కు లభించే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
 
తృతీయ కూటమి బలపడితే ఎన్డీయే, యూపిఏ పక్షాల నుంచి కూడా పార్టీలు బయటకు వచ్చి తమకు మద్దతు ప్రకటిస్తాయని కేసీఆర్ విశ్వాసంగా ఉన్నారు. తెలంగాణలో ఉన్నది 17 ఎంపీ సీట్లే అయినా వాటిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామనే ధీమాలో కేసీఆర్ ఉన్నారు. అయితే అనేక పెద్ద రాష్ట్రాల్లో ఎంపీలు ఎక్కువగా కలిగి ఉన్న పార్టీలు చాలానే ఉన్నా అనుభవం దృష్ట్యా నాయకత్వ బాధ్యతలు కేసీఆర్‌కే అప్పగించే అవకాశాలు కనపడుతున్నాయి. మూడో కూటమికి కేసీఆర్‌ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద మిత్రులుగా ఉన్న మోదీ, కేసీఆర్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధులుగా పోటీ పడనున్నారని తెలుస్తోంది. తెలంగాణ సాధించిన సమర్థ నాయకుడిగా పేరుండటంతో కేసీఆర్ నాయకత్వానికి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.    

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.