మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

యూఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తికి డాలస్‌లో ఘన సన్మానం

Updated: 04-05-2017 12:54:31

డాలస్‌: రాజా కృష్ణమూర్తి యూఎస్ కాంగ్రెస్ కు పోటీ చేయడానికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే డాలస్‌లో ఉన్న ప్రవాస భారతీయ మిత్రులు పాల్ పాండియన్, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎంవీల్ ప్రసాద్, సి.సి. థియోఫిన్, శ్రీధర్ తుమ్మల  ఒక ఆహ్వాన సంఘముగా ఏర్పడి భారీ విరాళాలు సేకరించి రాజా కాంగ్రెస్ కు ఎన్నిక కావడానికి ఎంతో కృషి చేశారు.  రాజా యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నిక అయినా తర్వాత తొలిసారిగా డాలస్ కు వీరు ఆహ్వానించి విజయోత్సవ సభ ఏప్రిల్ 29, 2017 టచ్ నైన్ రెస్టారంట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమ  నిర్వాహకు లు డాక్టర్ ప్రసాద్  తోటకూర రాజా కృష్ణమూర్తిని సభకు  పరిచయం చేస్తూ ఆయన చాలా భాద్యత గల  సభ్యుడని, అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్‌లో తన గళాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో  ముందంజలో  ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం జరిగిన 236 రోల్ కాల్స్‌లో 235కి హాజరవడం ద్వారా రాజా తన భాద్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారు అని చెప్పడానికి ఒక  ఉదాహరణ గా పేర్కొనవచ్చన్నారు.
 
రాజా తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విధంగా 
 
1. ఉద్యోగాలను సృష్టించడం ద్వారా  మన ఆర్ధికవ్యవస్థను వృద్ధి చేయడం 
2. వర్కింగ్ ఫ్యామిలీస్ కోసం అండగా నిలబడడం 
3. మహిళలకు సహాయ పడటం 
4. ఒబామా  “ఎఫోర్డ్బెల్ కేర్ యాక్ట్” ను సమర్ధించడం 
5. సీనియర్స్‌‌కు ఇచ్చిన  వాగ్దానాలను నిలబెట్టడం 
6. దేశ  భద్రతను కాపాడటం 
7. యుద్ధాల్లో పోరాడిన సైనికులను  గౌరవించడం లాంటి అంశాలను  కేంద్రీకరిస్తూ ఆశించిన ఫలితాల కోసం త్రీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.
 
రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం  యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా, 
 
1. విద్య మరియు ఉద్యోగుల కమిటీ
2. పర్యవేక్షణ మరియు ప్రభుత్వ సంస్కరణల కమిటీ లాంటి ముఖ్య కమిటీల్లో కీలక సభ్యుడిగా పని చేస్తున్నారని అన్నారు.
 
 
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒబామా  “ఎఫోర్డ్బెల్   కేర్ యాక్ట్” ను తొలగించాలని ప్రయత్నాలు చేసినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ రాజా ధృడంగా నిలబడ్డారని, ఇటీవల అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఏడు  ముస్లిం  దేశాల  వ్యక్తులను అమెరికా దేశంలోకి ప్రవేశాన్ని నిషేదించినప్పుడు దాన్ని రాజా త్రీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు.
ఇదే సందర్భంలో చికాగో ఓహారే అంతర్జాతీయ విమానాశ్రయంలో   కొంతమంది ముస్లిం దేశస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రవేశాన్ని అడ్డుకున్నారనే విషయాన్నీ తెలుసుకుని, హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకొని అక్కడ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం  చేసి, ప్రదర్శన  చేస్తున్న  ప్రజలకు మద్దతు తెలుపడం ద్వారా రాజా ప్రజల మనిషిగా నిరూపించుకున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కాంగ్రెస్ కు ఎన్నిక కావడానికి సహకరించిన డాలస్ మిత్రులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజా మున్ముందు అమెరికా రాజకీయాల్లో ఒక తిరుగులేని రాజకీయ శక్తీగాఎదుగుతారని డాక్టర్ తోటకూర ఆకాంక్షించారు. 
 
రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో భారతీయ అమెరికన్లకు చాలా ఓర్పు గల వారని, వాళ్ళు అవసరమైనప్పుడు తమ హక్కులను కాపాడుకోవటం కోసం తమ  గళాన్ని ఐకమత్యంతో వినిపించాలని చెప్పారు లేకుంటే అమెరికా జన జీవన స్రవంతిలో వెనుక బడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.   సభకు హాజరైన సభ్యులు ప్రస్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ మనమందరం కొంత సమయం కేటాయించి అమెరికా పార్లమెంట్ ను సందర్శించాలని, అక్కడి కార్యకలాపాలను తెలుసుకొని, మరియు కాంగ్రెస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు. ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లోనూ అగ్రపథం లో ఉన్నపటికీ రాజకీయ రంగంలో ఇంకా ఎంతో పురోగతి సాధించాలని ముఖ్యంగా ఆసక్తి గల యువతరం రాజకీయాల్లోకి రావాలని రాజా  కోరారు.  రాజా  చివరిగా డాలస్ లోని  ప్రజలు తన విజయానికి ఎంతో కృషి చేసారని, ఒక ముఖ్య పాత్ర పోషించారని, అందుకు తన మద్దతుదారులందరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.