మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

టెస్టు ఓటమికి బదులు తీర్చుకునే వేళైంది!

Updated: 01-02-2018 09:44:55

డర్బన్: దక్షిఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కు బదులు తీర్చుకునే వేళైంది. నేడు డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో సాయంత్రం 4:30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. చివరి టెస్టులో గెలుపుతో భారత్ ఊపుమీద ఉండగా, వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలి గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు స్టార్ ఆటగాడు డివిలియర్స్ అందుబాటులో లేడు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని, టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. 
 
రెండేళ్ల క్రితం భారత్‌లో పర్యటించిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను ఓడి వన్డే సిరీస్‌ను గెలిచింది. ఇప్పుడు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత్ కూడా దానిని  పునరావృతం చేయాలని భావిస్తోంది. టెస్టుల్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వన్డేల్లో విజృంభించి విమర్శకుల నోళ్లు మూయించాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని నిర్ణయించాడు. ఇక కోహ్లీ కూడా తన సహజసిద్ధమైన ఆటతీరుతో సిరీస్‌ను విజయంతో ముగించాలని యోచిస్తున్నాడు. మిడిలార్డర్‌లో జాదవ్, పాండ్యా కీలకం కానుండగా, ఆశించినంత వేగంగా ఆడలేకపోతున్న ధోనీకి ఈ సిరీస్ పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇక తుది జట్టులోకి రహానే వచ్చే అవకాశం ఉంది. అతడిని వద్దనుకున్న పక్షంలో పాండేవైపు కోహ్లీ మొగ్గు చూపొచ్చు. స్పిన్నర్లలో కుల్‌దీప్, చాహల్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.  

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.