మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

ఆస్ట్రేలియా చిత్తు.. ప్రపంచ కప్‌‌ను కైవసం చేసుకున్న భారత్

Updated: 03-02-2018 01:34:04

తౌరంగ: అండర్ 19 క్రికెట్‌ వరల్డ్ కప్ ఫైనల్‌ పోరులో భారత్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 67 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. నేటి విజయంతో భారత్ మొత్తం నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచినట్లైంది. గతంలో 2000, 2008, 2012లోనూ భారత్ కప్ గెలుచుకుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో మంజోత్ కల్రా సెంచరీ చేశాడు. వన్ మ్యాన్ షో చేశాడు. 102 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. పృథ్వీ షా 29, హర్విక్ దేశాయ్ 47 పరుగులు చేశారు. టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. మెర్లో 76, పరమ్ ఉప్పల్ 34, ఎడ్వర్డ్స్ 28, స్వినీ 23, మ్యాక్స్ బ్రాంట్ 14, హోల్ట్ 13, సంగ 13, సుదర్ లాండ్ 5  పరుగులు చేశారు. భారత బౌలర్లు తక్కువ పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పోరెల్, శివ్‌సింగ్, నాగర్‌కోటి, రాయ్‌ తలా రెండు వికెట్లు తీశారు. శివం మావి ఒక వికెట్ తీశాడు. భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించిన కల్రా మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా, శుబ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని, ఇది సమష్టి విజయమని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. విశ్వవిజేతగా నిలిచిన టీం ఇండియాకు బిసిసిఐ భారీ నజరానా ప్రకటించింది. ద్రవిడ్‌కు 50 లక్షల రూపాయలు, ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు, సపోర్ట్ స్టాఫ్‌కు 20 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ప్రపంచ కప్ గెలిచిన యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ, సెహ్వాగ్, జడేజా, ఇతర సీనియర్ ఆటగాళ్లు యువ ఆటగాళ్లపై అభినందనల వర్షం కురిపించారు. 

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.