ఇద్దరు మంత్రుల రాజీనామా.. ఎన్డీయేలోనే కొనసాగనున్న టీడీపీ
Updated:
09-03-2018 07:32:45
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లోని ఇద్దరు టీడీపీ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. సాయంత్రం ప్రధానమంత్రి నివాసానికి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిన వీరిద్దరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటానని చెప్పారని రాజీనామాల తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాజీనామాలు చేశామని చెప్పారు. కేంద్ర కేబినెట్‌కు మాత్రమే రాజీనామా చేశామని, ఎన్డీయేలో మాత్రం కొనసాగుతామని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సందర్భంగా ఏపీకి చేసిన హామీలన్నింటినీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు నిన్న ఉదయం ఏపీ కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించారు.