కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
Updated:
28-02-2018 09:37:50
చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) శివైక్యం చెందారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కంచిలోని మఠంలో నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. 1935 జులై 18న తంజావూరు జిల్లా ఇరుల్‌నికీలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. 1954 మార్చి 24న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి 69వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. కోట్ల మంది భక్తులకు ఆయన ఆరాధ్యులు. కంచి మఠం ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. జయేంద్ర కన్నుమూయడంతో ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. తన ఆలోచనలు, సేవ ద్వారా జయేంద్ర భక్తుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.