ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం అరెస్ట్
Updated:
28-02-2018 10:00:05
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత కార్తీ చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు. కార్తీ చిదంబరం చార్టెడ్ అకౌంటెంట్ ఎస్. భాస్కరరామన్‌ను ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈనెల 16న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కార్తీని అదుపులోకి తీసుకుంది. ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కార్తీ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు సేకరించినట్టు ఐఎన్ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జరుగుతున్న దర్యాప్తును తన పరపతిని ఉపయోగించి తప్పుదారి పట్టించేందుకు, ఐఎన్ఎక్స్ మీడియాను దీనిని నుంచి బటయపడేసేందుకు కార్తీ చిదంబరం ముడుపులు తీసుకున్నారని సీబీఐ వాదిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కార్తీని అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ ఆరోపించింది.