మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

మీడియా-సినీ పరిశ్రమల మధ్య సయోధ్యకు కృషి

Updated: 02-05-2018 02:46:46

మీడియాకు-సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించుకోవాలని, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవద్దని టియుడబ్ల్యూజె నేతలు సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై (ఏ.బి.ఎన్)దాడి అనంతరం మీడియాను హెచ్చరిస్తూ సినీ ప్రముఖులు ప్రకటనలు జారీ చేయడం జరిగింది. చివరకు మీడియాను నిషేధిస్తాం అంటూ సినిమా పరిశ్రమ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ ఛానెల్‌ల ఎడిటర్‌లు ఆరోపించిన నేపథ్యంలో సమస్యను సామస్యపూర్వకంగా పరిష్కరించుకోడానికి అల్లం నారాయణ నేతృత్వంలోని టియుడబ్ల్యూజె రంగంలోకి దిగింది.
 
బెదిరించి, బ్యాన్ చేసి మీడియాను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దని, వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని టియుడబ్ల్యూజె అధ్యక్షుడు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ సినీ పెద్దలకు సూచించారు. ఫిలిం నగర్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో పరిశ్రమ తరపున సురేష్ బాబు, అల్లు అరవింది, కె ఎల్ నారాయణ, ఎన్ శంకర్‌లు హాజరు కాగా టియుడబ్ల్యూజె తరపున అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి, ట్రెజరర్ మారుతి సాగర్‌లు పాల్గొన్నారు.
 
రెండు గంటల పాటు సాగిన సమావేశం గత నెల రోజులుగా మీడియాకు, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడ్డ స్పర్థలపై చర్చించడం జరిగింది. మీడియా ప్రసారాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని మీడియా దృష్టికి తీసుకురావాల్సింది కానీ బెదిరిస్తే కుదరదు అని తేల్చిచెప్పారు. దీంతో మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచన తమకు లేదని మీడియాతో స్నేహపూర్వకంగానే వుంటున్నామని అయితే కొన్ని మీడియా ల వల్ల సినీపరిశ్రమపై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మీడియా పెద్దలతో త్వరలో సమావేశం అవుతామని స్నేహపూర్వకంగానే సమస్యను పరిష్కరించాలని తాము కూడా అనుకుంటున్నామని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.