గవర్నర్‌పైకి హెడ్‌సెట్ విసిరిన కోమటిరెడ్డి.. మండలి చైర్మెన్ కంటికి గాయం
Updated:
12-03-2018 12:04:27
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. గవర్నర్‌పైకి కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌సెట్ విసిరారు. ఇది గవర్నర్‌కు తగలకుండా పక్కనే ఉన్న శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్‌కు తగిలింది. దీంతో హుటాహుటిన ఆయన్ను మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలంతా సరోజినీ దేవి ఆసుపత్రికి క్యూ కట్టారు.
మరోవైపు హెడ్ సెట్ విసిరిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి తన దాడిని సమర్థించుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో తాను విసిరానన్నారు. పోడియం దగ్గరకు వెళ్లకుండా పోలీసులను మోహరించారని, గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే హక్కు తనకుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు చేసిన నిరసనలను కోమటిరెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గీతారెడ్డి ప్రసంగ ప్రతులను చించి పోడియంపైకి విసిరారు. కోమటిరెడ్డి విసిరిన హెడ్ సెట్ తగిలి స్వామిగౌడ్ కన్నుకు గాయం కావడంతో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పోలీసులతో ఘర్షణ సమయంలో తనకు గాయాలయ్యాయని కోమటిరెడ్డి చెప్పారు. ఎక్స్‌రే కూడా తీశామన్నారు.