మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌లో సినిమాల నిలిపివేత‌

Updated: 28-02-2018 08:14:28

హైదరాబాద్: మార్చి 2 నుంచి  దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలు నిలిపివేయాలని ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ పిలుపునిచ్చింది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్‌పీ) అధిక‌ మొత్తంలో ధ‌ర‌లు పెంచడంతో నిర్మాతలు, పంపిణీదారుల‌పై భారం పడుతోందని కమిటీ ఆరోపిస్తోంది. థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని కాంట్రాక్టుల పేరుతో భారీ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుండడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు.    డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మాన్య‌ల‌తో ద‌క్షిణ భార‌త  చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ పలుమార్లు జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్టు  తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ‌ర్స్ డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోదర్ ప్ర‌సాద్, సెక్ర‌ట‌రీ  ముత్యాల‌ రామ‌దాసు తెలిపారు. 
 
మార్చి 2 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు ముత్యాల రామదాసు పేర్కొన్నారు. రెండు నెలల నుంచి డిజిటల్ ధరలను గణనీయంగా పెంచడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తమ పోరాటానికి తెలంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని థియేటర్ల యాజమాన్యాలు తమ పోరాటానికి మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. తమకు ప్రేక్షకుల మద్దతు కూడా అవసరమన్నారు.  
 
ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో వీపీఎఫ్ చార్జీలు కట్టేది లేదని.. రెండు సినిమా ప్రకటనలు తమకు ఇవ్వాలని.. కమర్షియల్ యాడ్లు 8 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉండకూడదనే మూడు డిమాండ్లను వారి ముందు ఉంచినట్టు  తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్ తెలిపారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో మార్చి 2 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, కేరళ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. ఒక్క ఏపీ, తెలంగాణలోనే 2400కు పైగా థియేటర్లు మూతపడనున్నాయి. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.