మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

బిజెపికి వ్యతిరేకంగా ఏకమౌతున్న ప్రాంతీయ పార్టీలు

Updated: 04-03-2018 12:31:39

హైదరాబాద్: 2014 పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బిజెపి తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ పాగావేసింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశం నలుమూలలా విస్తరిస్తోంది. దీంతో ఎస్పీ, బిఎస్పీ, ఆర్జేడే, జనతాదళ్ సెక్యులర్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, టిఆర్ఎస్ సహా అనేక ప్రాంతీయ పార్టీల్లో కలవరం మొదలైంది. 2014లో ఉత్తరాదిలో క్లీన్ స్వీప్ చేసినప్పుడే రాబోయే ప్రమాదాన్ని బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత ములాయం ఊహించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఏకమౌతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటినుంచీ బిజెపి అదే ఊపును రాష్ట్రాల్లోనూ కొనసాగించి అధికారం కైవసం చేసుకుంది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పాగా వేసింది. త్వరలో ఎన్నికలు జరగబోయే కర్ణాటక, ఒడిశాలోనూ పాగా వేసేందుకు కమలనాథులు సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారు. బిజెపి శ్రేణుల ఈ దూకుడే ప్రాంతీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. 
 
 
మోదీ, షా ద్వయం దూకుడుతో ప్రాంతీయ పార్టీల నేతల్లో కలవరం మొదలైంది. ఆర్జేడీ అధినేత లాలూ, నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు ఇతర నేతల్లోనూ అభద్రతాభావం మొదలైంది. ప్రస్తుతానికి పశ్చిమబెంగాల్‌లో బిజెపితో ప్రమాదమేమీ లేకపోయినా రాబోయే కొద్ది రోజుల్లో కమలనాథులు బలపడే అవకాశాలు ఉండటంతో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా భయం పట్టుకుంది. త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వానికి పట్టిన గతే తనకూ త్వరలో పట్టడం ఖాయమని ఆమె గ్రహించారు. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఒడిషాలో కూడా బిజెపి గట్టిపోటీ ఇవ్వనుంది. బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కమలనాథులు విశ్వాసంగా ఉన్నారు. దీంతో బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి ఆయన కూడా మమత తరహాలోనే ఎన్డీయేకు దూరంగా ఉంటున్నారు. ఒకరకంగా వీరు కాంగ్రెసేతరే అయినా అవసరమైతే మళ్లీ యూపిఏతో కలిసిపోతారు. 
 
నానాటికీ బిజెపి బలపడుతుండటంతో మిగతా ప్రాంతీయ పార్టీల నేతలంతా ఓ కూటమిగా మారేందుకు యత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల నేతలంతా ఓ కూటమిగా ఏర్పడాలని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. వామపక్షాలను కూడా కలుపుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. వామపక్షాలు ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఒక్క కేరళలోనే. అయితే త్రిపురలో అలాగే పశ్చిమబెంగాల్‌లోనూ వారికి కొంత ఉనికి ఉంది. అయితే ఇది క్రమేణా మరింత బలహీనపడుతుందని వామపక్షవాదులు కూడా విశ్వసిస్తున్నారు. 
 
కేసీఆర్‌ ప్రస్తుతానికి ఎన్డీయేలో లేకపోయినా మోదీ సర్కారుకు అవసరమైన సమయంలో అండగా ఉంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో మోదీకి ఎదురుతిరగాలని, జాతీయ స్థాయిలో కూటమి ఏర్పరిచి బిజెపికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్నది 17 ఎంపీ సీట్లు మాత్రమే. ఇందులో ఆయన పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుటుందనే దానిపై ఆయన జాతీయ స్థాయి కూటమి ఏర్పాటులో ముందడుగు పడుతుంది. అయితే తన చాణక్యనీతితో దేశంలో బిజెపి, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఐక్యం చేయగలనని ఆయన ధీమాగా ఉన్నారు. కేసీఆర్‌కు ఎన్డీయే పక్షాలనుంచి కూడా మద్దతున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు కూడా కేసీఆర్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చల ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి టిఆర్ఎస్‌లో విలీనం కావడమో లేక ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతునీయడం ఖాయమని సమాచారం. శివసేనతో కూడా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. శివసేన కూడా కొంతకాలంగా బిజెపి వైఖరితో అసంతృప్తిగా ఉంది. 
 
కేసీఆర్ నేతృత్వంలో జాతీయ కూటమి బలపడితే ఎన్డీయే, యూపిఏలోని పక్షాలు కూడా వారితో చేతులు కలిపేందుకు వెనుకాడరు. నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్, జెడియూ అధినేత నితీశ్, అలాగే లోక్ జనశక్తి రాం విలాస్ పాశ్వాన్ లాంటి నేతలు కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడే జాతీయ కూటమికి మద్దతు పలికే అవకాశాలున్నాయి. ఈ కూటమి కనుక నిర్ణాయక శక్తిగా మారితే కాంగ్రెస్ కూడా మద్దతిచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే మోదీ, షా ద్వయం వేసే ఎత్తుల ముందు ప్రాంతీయ పార్టీ నేతలు చిత్తవకుండా ఉంటారా అనేది త్వరలోనే తేలనుంది. నిజంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసినా పార్టీ నేతల మధ్య సఖ్యత, సీట్ల సర్దుబాటు, నాయకత్వం, పదవుల పంపిణీ వంటి విషయాల్లో రాజీ అనేది అంత ఈజీ కాదు. 
 
మరోవైపు నరేంద్ర మోదీ అవినీతి ఛాయలు లేకుండా ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతున్నారు. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయేవారి భరతం పట్టే కొత్త చట్టాన్ని కూడా రూపొందిస్తున్నారు. తద్వారా ఇప్పటికే పారిపోయిన మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ తదితరుల ఆస్తులను కేంద్రం జప్తు చేసుకుని వేలం నిర్వహించి బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించేలా చట్టం రూపొందుతోంది. పేద ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు మరిన్ని సంక్షేమ పథకాలకు మోదీ శ్రీకారం చుడుతున్నారు. ఆయుష్మాన్ అనేది అందులో భాగమే. కొద్ది మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే కుటుంబం మొత్తం ఐదు లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఆయుష్మాన్ పథకంలో పొందుపరిచారు. బినామీ బిల్లుపై కూడా కేంద్రం దృష్టిపెట్టినట్లు సమాచారం. నేతలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ టైకూన్‌లు తమ వద్ద పనిచేసేవారు, ఇతర కుటుంబ సభ్యులపై ఉంచిన భూములు, ఇళ్ల లెక్కలను బినామీ బిల్లు బయటకు తేనుంది. అయితే ఈ బిల్లును ఎప్పుడు తెస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఇది వస్తే కనుక ప్రజల్లో మోదీ నాయకత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుంది. ఇది కాకుండా ఇప్పటికే లోక్‌సభలో ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలోనూ ఆమోదింపచేసి ముస్లిం సోదరీమణుల కష్టాలు తొలగించాలని మోదీ యోచిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సోదరీమణుల ఓట్లు కూడా బిజెపికి ఖాయంగా పడే అవకాశాలున్నాయి.. చివరగా అయోధ్య రామ మందిర నిర్మాణ అంశాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలన్న విషయంలో ఎంతో ప్రగతి సాధించారు. ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నేతృత్వంలో చర్చల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముస్లిం వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయోధ్య వివాదం పరిష్కారం అయితే ఉత్తరాదితో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బిజెపి మరింత బలపడుతుంది. 
 
దీనికి తోడు అమిత్ షా పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ కేడర్‌ను ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో కూడా సత్తా చాటాలని బిజెపి అధినాయకత్వం యోచిస్తోంది. కేసీఆర్ కాకపోయినా మరో నేత అయినా కూటమి కోసం యత్నించవచ్చని మోదీ, షా ముందే ఊహించారు. ఎన్నికల ముందే ఈ కూటమి యత్నాలు జోరందుకుంటాయని కూడా వారు గ్రహించగలిగారు. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ కేడర్‌ను బలోపేతం చేశారు. అనేక అంశాలపై ఆయా రాష్ట్రప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయానికి బిజెపికి తిరుగులేకుండా చేయడానికి అన్ని యత్నాలూ చేస్తున్నారు. 2014 కన్నా ఎక్కువ స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్డీయేలోకి కొత్త పార్టీలను చేర్చుకుంటూనే ఇతర పార్టీలపై ఆధారపడకుండానే బిజెపి 272 స్థానాలు సాధించేలా ఎత్తులు వేస్తున్నారు. తద్వారా యూపిఏను కానీ కేసీఆర్ కూటమిని కానీ చిత్తు చేయవచ్చని మోదీ, షా ద్వయం భావిస్తోంది. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.