త్రిపురలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం..
Updated:
09-03-2018 02:21:00
అగర్తల: కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో బిజెపి ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్ విప్లవ్ దేవ్ ప్రమాణానికి హాజరుకావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అధికారం అప్పగించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటు వేసిన వారికే కాదు, వేయని వారిని కూడా కలుపుకుని ప్రతి ఒక్కరికీ సేవ చేస్తామన్నారు. అమిత్ షా మాట్లాడుతూ చారిత్రక తీర్పు ఇచ్చిన త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 35 స్థానాలను, బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్‌టి 8 స్థానాలను కైవసం చేసుకుంది. సిపిఎంకు 16 స్థానాలు దక్కాయి. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.