మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

కల్పవృక్ష వాహనంలో శ్రీవారు

Updated: 26-09-2017 01:24:16

శ్రీవారి వార్షిక బ్రహ్మొత్సవాలలో  ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడ వీధుల్లో విహారిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి గొప్పది కల్పవృక్షం.  కల్పవృక్షంపై కొలువుతీరిన వేంకటేశ్వరుడిని తమిళులు రాజమన్నార్ అవతారంగా కొనియాడతారు. భక్తులు కొరిన కొర్కెలను కల్పవృక్షం, కామధేనువు, చింతామణి తీరుస్తాయనది పురాణ ప్రాశస్త్యం. తనను శరణు కొరిన భక్తుల కొర్కెలను తీరుస్తానని చెప్పడానికే శ్రీవారి ఉభయదేవురలతో కలసి కల్పవృక్షంపై దర్శనమిస్తారు. క్షీరసాగర మధనంలో ఉద్బవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పిలు లేకపోవడం పూర్వజన్మస్మరణ కలగడంతో పాటు కోరిన కొర్కెలన్ని నెరవేరతాయి కల్పవృక్షం సకల ఫలప్రదాయం, కావున తనను వేడుకున్నవారికి తానే అన్ని సమకూర్చుతాడని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు భక్తులకు తెలియజేస్తారు. కల్పవృక్షవాహనంలో పశువుల కాపరైన గోపాలకృష్ణుడి రూపంలో స్వామివారిని అలంకరిస్తారు. నిస్సంకల్ప స్థితికి నిష్కామ స్థితికి, నిశ్చింతా స్థితికి కల్పవృక్ష వాహన దర్శనం ద్వారానే ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందగలరు.
శ్రీవారికి కళా నీరాజనం..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో కళాబృందాలు తమ ప్రదర్శనలతో స్వామివారికి కళానీరాజనం సమర్పించాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
అలరించిన అఘోరా నృత్యం  : 
రాజమండ్రికి చెందిన శ్రీ మారుతి నాసిక్‌ డోలు బృందం ప్రదర్శించిన అఘోరా నృత్యం భక్తులను అలరించింది. శ్రీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వినాయకుడు దేవతారూపాలు ధరించిన కళాకారులు మధ్యలో నిలిచి ఉండగా, అఘోరా వేషధారణలోని కళాకారులు శూలాలతో నృత్యం చేశారు. ముగ్గురు కళకారులు డోలు వాయిస్తుండగా అందుకు అనుగుణంగా అఘోరాలు అడుగులు వేసి ముందుకు కదిలారు.
లయబద్ధంగా గుడియాత్తం కళాకారుల డప్పు వాద్యం : 
తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన కళాకారుల డప్పు వాయిద్య ప్రదర్శన లయబద్ధంగా సాగింది. శ్రీవారి ట్రస్టుకు చెందిన శ్రీ శివనటేషన్‌ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. ఇందులో 4 పెద్ద డ్రమ్స్‌, 8 డప్పులు, 4 తాశాలు ఉన్నాయి. పెద్ద డ్రమ్స్‌ను లయబద్ధంగా వాయిస్తుండగా డప్పు కళాకారులు వారిని అనుసరిస్తూ గుండ్రంగా తిరుగుతూ ప్రదర్శన ఇచ్చారు.
సాగరమథనంలో  ఉద్భవించిన కల్పవృక్షం : 
రాజమండ్రికి చెందిన శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శ్రీ గరుడాద్రివాసా భజన మండలి సభ్యులు సాగరమథనంలో కల్పవృక్షం ఉద్భవించే ఘట్టాన్ని ప్రదర్శించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు అమృతం కోసం సాగరాన్ని మథించగా, అందులో నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, కామధేనువు, కల్పవృక్షం ఉద్భవించిన తీరును చక్కగా ప్రదర్శించారు. 
అలాగే, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన శ్రీ అరవింద పునూర్‌ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ప్రదర్శించిన లెజిమ్‌ వాద్య విన్యాసం ఆకట్టుకుంది. గోపికల వేషధారణలో బాలికలు వెన్నకుండతో నృత్యం చేయడం, పిఠాపురానికి చెందిన శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సేవా సంఘం ప్రదర్శించిన కోలాటం, చెక్కభజనలు భక్తుల్లో భక్తిభావాన్ని నింపాయి.
 
 
 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.