సనాతన ధర్మ రక్షకుడు అది శంకరుడు..
Updated:
30-04-2017 10:42:58
'ఎవరు తప్పుకోవాలి?.. తప్పుకోమన్నది నన్నా?.. నాలోని ఆత్మనా?.. అన్నమయమైన ఇరువురి శరీరాల్లోని ఆత్మ ఒకటే కదా?.. ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పే మాటలా ఇవి?..'
కాశీలో గంగానదిలో స్నానం చేసి శిష్యులతో కలిసి విశ్వనాథుని దర్శనానికి వెళుతున్న శంకరాచార్యులకు దారిలో కుక్కలతో వస్తున్న చండాలుడు ఎదురయ్యాడు.. శిష్యులు అతన్ని తప్పుకొమ్మన్నారు.. అప్పుడు చండాలుడు వేసిన ప్రశ్నలు ఇవి.. చండాలుని ప్రశ్నలతో శంకరునికికి జ్ఞానోదయమైంది.. తన ఎదుట ఉన్నది సాక్షాత్తు పరమ శివుడే అని, ఆ కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక తెలుసుకున్నాడు.. వెంటనే ప్రణమిల్లాడు..
కేరళలో జన్మించిన శంకరుడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి సకల శాస్త్రాభ్యాసం చేశారు.. కాలి నడకన భారత దేశం నలుమూలలా పర్యటించి పీఠాలను నెలకొల్పారు.. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు భాష్యం రాశారు.. అద్వైతాన్ని బోధించి, బ్రహ్మం ఒక్కటే జ్ఞానమని చాటి చెప్పారు.. శాస్త్ర చర్చలో ఎందరో పండితులను ఓడించారు.. సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు..
శంకర భగవత్పాదుల కృషి కారణంగా ఈనాడు హైందవ ధర్మం సగర్వంగా తలెత్తుకొని కాల పరీక్షలో నిలబడింది. కానీ మనలో అంటరానితనం, మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి.. వీటిని అంతమొందించడమే శంకరుడు బోధించిన నిజమైన బ్రహ్మ జ్ఞాన పరమార్థం.
--క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్