సూరదాసుకు శ్రీకృష్ణుడే సర్వస్వం
Updated:
01-05-2017 01:09:36
హిందీ సాహిత్య ఆకాశంలో సూర్యుడు.! కృష్ణభక్తిలో సాగరం...! వాత్సల్య భక్తిరసంలో అద్వితీయ కవి....! మాధుర్య భావాల జనకుడు...! ఆయనే సంత్ సూరదాసు....! సూరదాసు పుట్టు గ్రుడ్డివారు..! అయితేనేం...మనో నేత్రంతో ప్రపంచంలోని అన్ని విషయాలను గుర్తించగలిగిన అపార శక్తిమంతుడు...!
భక్తి ఉద్యమంలో సూరదాస్ ఎంతో ప్రాఖ్యాతి పొందారు. ఉత్తర భారతలో ఆయన ఎంత ఖ్యాతి పొందారంటే.... ఆయన పుట్టింది 14వ శతాబ్దం..! అప్పటి నుంచి....ఇప్పటి 21వ శతాబ్దం వరకు ఆయన జన్మ, జీవనం, సాధనలు, కావ్యరచనలు, మరణం గురించి వందలాది కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అనేక మంది విద్వాంసులు సూరదాసు కృతులపై అనేక గ్రంథాలు రాశారు. ఆయన రాసిన కవితలు, పాటలను కొత్త కొత్త రాగాలలో పాడూతూ...కొత్త కొత్త అర్థాలను గ్రహించడం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. నేడు దేశంలోని అనేక ప్రముఖ భాషలలో సూరదాసు పాటలు అనువాదం అయ్యాయి.
ఢిల్లీకి సమీపంలోని సాహి అనే చిన్న గ్రామంలో క్రీ.శ.1478వ సంవత్సరంలో ఓ నిరుపేద దంపతులకు సూరదాసు జన్మించారు. ఆయన కళ్ళు లేకపోవడంతో....తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు. చుట్టు ప్రక్కల వారంతా సానుభూతి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆయనకు "సూర" అని నామకరణం చేశారు. తల్లిదండ్రులకు సూరను ఎత్తుకుంటే చాలు ఆకలివేయడం కూడా తెలిసేది కాదు. సూర ఎంతో ముద్దుగా ఉండేవారు. కళ్లు లేకపోయిన తడబడకుండా అడుగులు వేసేశారు. అంతేకాదు చాలా బాగా పాడేవారు. తన తల్లిపాడే భజనలన్నీ ఆయనకు కంఠస్థమే...! ఒక్కసారి వింటే చాలు...! ఆయనకు అన్ని గుర్తిండిపోయేవి. సూర మాటలు చాలా స్పష్టంగా పలికేవారు. ఆయన పాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించే కంఠం...! కూర్చున్నా, నిల్చున్నా, భజన చేసేవాడు. పాడుతూ నృత్యం కూడా చేసేవాడు.
సూర చాలా సార్లు ఇంటికి దూరంగా పోయి పాడుతూ ఆడుతూ గడిపేవారు. ఆయన పాడుతూ ఉంటే పగలు, రాత్రి తెలిసేది కాదు. ఒక్కడే వేగంగా నడవగలిగేవారు. అతని నడక చూస్తే మాత్రం కళ్లు కనిపించవు అని ఎవరు చెప్పలేరు. సూరదాసుపై ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి సూరదాసు బావిలో పడ్డాడు. ఒక వారం రోజులపాటు ఆయన అందులోనే ఉన్నాడు. చివరికి బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆయన్ను బావి నుంచి బయటకు తీసుకువచ్చారు. శ్రీకృష్ణుడు దృష్టిని సైతం ప్రసాదించారు. అయితే శ్రీకృష్ణుడిని చూసిన సూర...ఇక నిన్ను చూసిన తర్వాత నాకు ఈ కళ్లెందుకు ? వాటిని నువ్వే తిరిగి తీసేసుకో అన్నాడని అంటారు.
సూరదాసు గురువు వల్లభాచార్యులు. వీరి జన్మస్థలం కాశి నగరం. సూరస్వామి పుట్టిన సంవత్సరంలోనే వీరు కూడా జన్మించారు. చిన్నవయస్సులోనే వేదశాస్త్ర పారంగతుడైన ఆయన దేశమంతటా ప్రర్యటించారు. శ్రీకృష్ణ జన్మభూమి మథుర వీరి కార్యక్షేత్రం. మథుర, ద్వారక, గోకుల, గోవర్థనగిరి చుట్టుప్రక్కల వల్లభాచార్యులకు శిష్య బృందాలు ఉండేవి. ప్రయాగ నుంచి మథుర వరకూ యమునా నదిలో ప్రయాణించే సమయంలో వల్లభాచార్యులు సూరస్వామి గురించి తెలుసుకున్నారు. ఆయనను చూసేందుకు ఆచార్యులు గవూఘాట్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న సూరస్వామి కూడా ఆచార్యులను కలుసుకునేందుకు ఘాట్ కు వచ్చారు. సూరస్వామి సుందర వ్యక్తిత్వం ఆచార్యుడిని ఆకర్షించింది. ఆయనకు సూరదాసు అని నామకరణం చేశారు. మూడు రోజులపాటు వల్లభాచార్యులు శ్రీమద్భాగవతాన్ని వివరించి ఉపదేశం చేశారు. శ్రీకృష్ణుడి లీలా విశేషాలను తెలియజేశారు. "పురుషోత్తమ సహస్ర నామం "నేర్పారు. ఇక ఇప్పటి నుంచి సూరదాసుకు శ్రీకృష్ణుడే సర్వస్వం
వల్లభాచార్యుడు... సూరదాసును తన ఇతర శిష్యులతోపాటు మొదటిసారిగా గోకులానికి తీసుకెళ్లారు. గోకులంలో అడుగు పెట్టిన సూరదాసు...శ్రీ కృష్ణుడి బాల్య లీలలకు సంబంధించిన ఎన్నో సుందర భావనలతో కూడిన పాటలు ఆయన కంఠం నుంచి జాలువారాయి. వల్లభాచార్యుడు వాటిని వింటూ ఆనందపడేవారు. వల్లభాచార్యుడు శ్రీనాథ మందిరాన్ని పునర్నిర్మించాడు. పూజా కార్యక్రమాలకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంకీర్తన వ్యవస్థ బాధ్యత సూరదాసుకు అప్పగించారు. సూరదాసుకు కుంభనదాసు, కృష్ణదాసు, పరమానంద దాసు అనే ముగ్గురు గాయకులు తోడయ్యారు. ఇక అప్పటి నుంచి సూరదాసు జీవితం అంతా అదే పని..! 32 ఏళ్ళ వయస్సులో వైష్ణవ దీక్ష తీసుకుని...శ్రీనాథ స్వామి ఆలయంలో గాన సేవకు అంకితయ్యారు. ఆయన 80 ఏళ్ళ ప్రాయం వరకూ శ్రీకృష్ణుడి గుణగానం చేస్తూనే ఉన్నారు. వేలాది పదాలతో సుందర రాగాలతో భాగవత కథను ఆయన పాడారు. ఆ కాలంలో భక్తకవులకు ఆయన "శిరోమణి" అయ్యారు.
అక్బర్ ఆస్థానంలోని తాన్ సైన్ సైతం సూరదాసు కీర్తనలను పాడేవారు. స్వయంగా అక్బర్...అబుల్ ఫజల్ తో సూరదాసుకు ఉత్తరం రాయించి మథురలో కలవడానికి అంగీకరించాలని విన్నవించుకున్నారు. సూరదాసుకు అక్బర్ ఎంతో గౌరవాభిమానాలతో స్వాగతం చెప్పారు. ఆయన్ను ఏదైనా సూరదాసు కీర్తన పాడాలి కోరారు అక్బర్. అప్పుడు సూరదాసు.... బిలావల్ రాగంలో..., భక్తి, వైరాగ్యాలతో పాడిన పాట అక్బర్ ను సైతం కంఠతడి పెట్టించింది. సూరదాసుకు ఏదైనా కానుక ఇవ్వాలని తలచిన అక్బర్...ఆయన్ను మీకేం కావాలో అడగండి ఇస్తాను అన్నారు. అయితే చిరునవ్వు నవ్వి సూరదాసు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత వినయంతో ఇంకొకసారి నన్ను పిలిపించరాదని, నన్ను కలవడానికి ప్రయత్నించరాదని కోరాడు సూరదాసు. "చౌరాసీ వైష్ణవన్ కీ వార్తా" లో వివరించిన ప్రకారం సూరదాసు 1580వ సంవత్సరంలో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
--- సామర్ల వెంకటేశ్వర్లు, ఆధ్యాత్మికవేత్త, భాగ్యనగరం