మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

నేడు విజయవాడలో శ్రీనివాస కల్యాణం

Updated: 08-07-2017 11:56:01

అమరావతి: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వసంతోత్సవం, సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించనున్నారు. వసంతోత్సవం - ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వసంతఋతువులో, మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. చరిత్రకందని కాలంనుంచి ఈ వసంతోత్సవ ప్రక్రియ జరుగుతున్నది. శ్రీవారి కల్యాణం - సాయంత్రం 6.30 నుండి 8.30 వరకు .... ఉభయనాంచారులతో కూడిన మలయప్పస్వామిని యాగశాలలో ఉంచి సంకల్పం, హోమం, విశేషపూజలు చేసి గోత్ర ప్రవరలను చెప్పి మహాసంకల్పంతో కన్యకాదానమును నిర్వహిస్తారు. ఆ తర్వాత లాజ హోమము, ప్రధాన హోమము, అక్షతారోపణ చేసి ఆర్జితసేవా భక్తు లను ఆశీర్వదిస్తారు. ఇది చక్కని సంప్రదాయ పద్ధతులతో, చక్కని మంత్ర-తంత్ర-గద్య-పద్యాలతో జరుగుతుంది. అనేక వేలమంది భక్తులు స్వామిని దర్శించి తరిస్తారు. ఇది స్వామికి, ప్రతి నిత్యం జరుగుతుంది. కల్యాణం శ్రీవారి ఆలయంలోపల గల సంపంగి ప్రాకారపు కల్యాణమండపంలో జరుగుతుంది. ఉభయనాంచారులైన శ్రీదేవి, భూదేవి దేవేరులను స్వామికి ఎదురుగా సింహాసనంపై ఉంచి ఈ వివాహపుతంతు జరుపు తారు. స్వామికి ఏనాడు ఈ కల్యాణ ఉత్సవపుసేవ ప్రారంభమైనదో తెలీదుగానీ నేటికీ నిరంతరంగా ప్రతిరోజు ఆర్జితసేవగా జరుగుతుంది. అనంతరం రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం, రాత్రి 10.00 గంటలకు ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ వాసురావు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.