మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

కార్తీక మాసంలో ఇలా చేస్తే మీకు తిరుగుండదు

Updated: 21-10-2017 01:33:55

హిందూ మతంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కార్తీకం అంటే స్త్రీలు ఎంతో పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. మాసం ముగిసేదాకా భక్తిప్రపత్తులతో ప్రతి రోజూ దీపారాధన చేసి భగవత్ కృపకు పాత్రులయ్యేందుకు ప్రయత్నిస్తారు. కార్తీకమాసంలో మనం చేసే పూజలు, ఉపవాసాలు వృథాపోవు. జన్మజన్మల పాపాలు తొలగిపోవడమే కాదు, ఎనలేని పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన మాసం కాబట్టే ఆడవాళ్లు వేకువ జామునే లేచి పుణ్యస్నానాలు ఆచరించి పూజాదికాలు ఆచరిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ కార్తీకం చాంద్రమాన కాలం ప్రకారం ఎనిమిదో నెల. అంటే శరద్ రుతువులో రెండో నెలగా వస్తుంది. కార్తీకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి దర్శనమిస్తాడు. అందుకే దీన్ని కార్తీక మాసం అంటారు. స్కంద పురాణంలో దీని గురించి చాలా వివరంగా చెబుతారు. శ్రీమహావిష్ణువుకు సరితూగే దేవుడు మరొకరు లేరన్నది ఎంత వాస్తవమో... కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదన్నది కూడా అంతే వాస్తవం. మానవులు జన్మ కారణం ప్రకారం అనేక రకాల పాపకార్యాలు చేస్తుంటారు. వాటన్నిటికి పరిహారం చేసుకోవాలంటే కార్తీక మాసం సరైనదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈ మాసంలో వచ్చే చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ పర్వదినాల్లో గనుక పుణ్యస్నానాలు చేసి ఉపవాసం ఉంటే పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, కార్తీకమాసంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి విశేష ప్రాధాన్యం ఉంది. అక్కగానీ, చెల్లెలుగానీ వండిన ఆహారం తిని వారికి కానుకలు సమర్పిస్తే సర్వ సంపదలు వరిస్తాయట. అలా వీలుకాకపోతే ఉసిరి చెట్టుకు పూజలు చేసి, వనభోజనాలు చేసినా సరిపోతుందట. మొత్తమ్మీద 30 రోజులు కార్తీక దీక్ష చేపట్టి విజయవంతంగా పూర్తిచేసిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుందని మహామునులు చెబుతుంటారు. నెల రోజులు చేయలేనివారు కొన్ని ఎంపిక చేసిన పర్వదినాల్లో పూజాదికాలు, ఉపవాస దీక్షలు చేస్తే పుణ్యం దక్కుతుందట

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.