ఎన్నికల తర్వాత పవన్ మద్దతు మాకే: వైసీపీ ఎంపీ వరప్రసాద్
Updated:
15-03-2018 01:18:26
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత పవన్ మద్దతు తమకే అని వైసీపీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. ఇటీవలే పవన్ ఫోన్ చేసి తనను పిలిపించుకున్నారని, తాను వెళ్లి కలిశానని చెప్పారు. టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నందుకే విమర్శలు చేస్తున్నామని చెప్పినట్లు ప్రసాద్ వెల్లడించారు. టీడీపీతో ఉన్నందుకే తాము విమర్శలు చేస్తున్నామని తెలిపినట్లు వరప్రసాద్ చెప్పారు. హోదా కోసం వైసీపీ, జనసేన కలిసి పోరాడుతాయని చెప్పారు. మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన వరప్రసాద్ బహిరంగంగా చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ప్రత్యేక హోదాపై పవన్ నిన్న మాట్లాడినట్లుగానే వైసీపీ గత నాలుగేళ్లుగా మాట్లాడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. నిన్నటి పవన్ స్పీచ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన అవసరం పవన్‌పైనే ఉందన్నారు. రేపే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వంద మంది ఎంపీలు తమకు మద్దతు ఇవ్వబోతున్నారని వైసీపీ వెల్లడించింది. పవన్ ప్రసంగంపై సిపిఎం కూడా ప్రశంసలు కురిపించింది. పవన్ వాస్తవాలు మాట్లాడారని తెలిపింది.