మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

కేంద్రం గేమ్ మొదలుపెట్టింది, ఇక మహాయుద్ధమే: చంద్రబాబు

Updated: 15-03-2018 11:22:48

అమరావతి: టిడిపిని దెబ్బతీయడానికి మహాకుట్ర జరుగుతోంది ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం గేమ్ మొదలుపెట్టిందని, ఇక మహాయుద్ధమేనన్నారు. మహా కుట్ర రచనలో చాలామంది పెద్దలున్నారని చంద్రబాబు చెప్పారు. స్థానికంగా కొందరు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. తమిళనాడు తరహాలో బీజేపీ ఏపీలో రాజకీయం చేయాలని చూస్తోందని, బలమైన నాయకత్వం ఉన్నచోట బలహీనపర్చాలని బిజేపీ యత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇది సహించబోమని యుద్ధం చేస్తామన్నారు. ఎలాంటి రాజకీయాలు చేసినా వెనక్కు తగ్గేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటి ప్రతినిధులు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కుట్రలో భాగస్వాములందరినీ ప్రజలు తిరస్కరిస్తారని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్నో కుట్రలను తెలుగుదేశం పార్టీ సమర్ధంగా ఎదుర్కొందన్నారు. ప్రత్యర్ధుల కుట్రలను ప్రజలే తిరస్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలే రక్షకభటులని, పార్టీని, రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. లాలూచీ రాజకీయాలను ప్రజలు సహించరని, తెలుగుదేశం పార్టీపై కుట్రలను ప్రజలే తిప్పికొడతారని చంద్రబాబు చెప్పారు. 
 
నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు, నారా లోకేశ్‌పై ఆరోపణలు, విమర్శలు చేయడంతో టీడీపీ ఉలిక్కిపడింది. పవన్ వెనుక బీజేపీ నేతలు ఉండి ఉండొచ్చనే అనుమానం టీడీపీ నేతల్లో ఉంది. పవన్‌తో దీక్ష చేయించి కేంద్రం హోదా, జోన్ ఇస్తుందా అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.