మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఆ ఆరోపణలు నిరూపించగలరా? పవన్‌కు చంద్రబాబు సవాల్

Updated: 16-03-2018 07:48:11

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొట్టిపడేశారు. ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించగలరా? అని సవాలు విసిరారు. డబ్బు కోసమే అయితే లోకేశ్ హెరిటేజ్‌ను చూసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. వ్యాపారాలతో ఏడాదికి రూ.65  కోట్లు వచ్చే దానిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ కోసమే లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. లోకేశ్ చిన్నగా ఉన్నప్పుడు రోజూ అర్ధరాత్రి తర్వాత మాత్రమే చూసేవాడినని, లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్‌ను వారానికి ఒకసారి మాత్రమే చూసుకోగలుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జనసేన అధినేత పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ఎఫ్‌సీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి అడగకుండా మధ్యవర్తులుగా ఉంటారంటారేంటని మండిపడ్డారు. ఎన్డీయేలో ఉన్నప్పుడు ఇతర పార్టీలతో మాట్లాడేందుకు కొంత ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు బయటకు రావడంతో ఏ మొహమాటాలూ లేవని అన్నారు. జాతీయ పార్టీలు అన్నింటినీ కలిపి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఇంకా ఎన్డీయేలో కొనసాగడం అనైతకం కాబట్టే బయటకు వచ్చినట్టు చెప్పారు. వైసీపీ అవిశ్వాసం పెడతామన్నా ఒక్కరు కూడా ముందుకు రాలేదని, కానీ తాము అవిశ్వాసం పెట్టగానే ఎవరితోనూ మాట్లాడకున్నా మద్దతు ఇచ్చేందుకు అనేక పార్టీలు ముందుకొచ్చాయని, టీడీపీకి ఉన్న విశ్వసనీయత అదని చంద్రబాబు వివరించారు.

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.