సహనాన్ని పరీక్షించకండి: నాగబాబు కన్నెర్ర
Updated:
18-04-2018 12:06:43
హైదరాబాద్: సైలంట్‌గా ఉన్నామని మెగా కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని నాగబాబు హెచ్చరించారు. క్యాస్టింగ్ కౌచ్ తదితర సమస్యలుంటే పోలీసులను ఆశ్రయించాలన్న పవన్ కళ్యాణ్‌ను తప్పుడు మాటలనడంపై నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బలవంతులం కాబట్టే భరిస్తున్నామని చెప్పారు. బలహీనులు భరించలేరని గుర్తు చేశారు. ఎదుర్కోవడం చేతకాకపోతే వ్యక్తిత్వంపై దాడి చేస్తారని పవన్ బాబు చెప్పారని నాగబాబు గుర్తు చేశారు. తాను జనసేన పార్టీ కార్యకర్తను కానని, తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శలను తిప్పికొట్టడం కూడా పవన్ ఇష్టపడరని నాగబాబు చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో ఆయన కొద్ది సేపటి క్రితం మాట్లాడారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు కొన్ని పరిమితులుంటాయని, తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వాలని విజ్ఞప్తి చేయగలమని, అంతకు మించి కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలను ఒత్తిడి చేయలేమని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పనిచేసే మహిళల గురించి తక్కువగా, చులకనగా మాట్లాడవద్దని సూచించారు. ఇండస్ట్రీ ఇంత దారుణంగా ఉంటే తన కుమార్తెను సినిమాల్లోకి ఎలా తీసుకొస్తానని నాగబాబు ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దృష్టికి తెస్తే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పవన్ ఫ్యాన్స్ తమపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారని కొందరంటున్నారని, విమర్శలపై స్పందించవద్దని పవన్ మూడు నెలల క్రితమే చెప్పారని నాగబాబు గుర్తు చేశారు. తాను ఇప్పుడు కూడా చెబుతున్నానని, విమర్శలపై సోషల్ మీడియాలో స్పందించవద్దని అభిమానులకు సూచించారు. అయితే ఫ్యాన్స్ పేరుతో ఎవరో ఏదో ట్రోల్ చేస్తే తమను టార్గెట్ చేయడం తగదని నాగబాబు చెప్పారు. అందరినీ తాము ఎలా అదుపుచేయగలమని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై కొందరు చేసిన తీవ్ర విమర్శలను మాధవీలత లాంటి ఆర్టిస్టులు, సినీ రంగంలోని అనేకమంది తిప్పికొట్టడంపై నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. సినిమాల్లో టాప్ స్టార్‌గా ఉన్న సమయంలో అన్నీ వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి పవన్ వెళ్లిపోయాడని, తాను పవన్‌తో మాట్లాడి ఆరు నెలలైందని నాగబాబు చెప్పారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగదని నాగబాబు హెచ్చరించారు.