కూలిన సైనిక విమానం.. 257 మంది దుర్మరణం
Updated:
11-04-2018 06:51:24
అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనికులతో వెళ్తున్న విమానం కూలిన ఘటనలో 257 మంది సైనికులు అసువులు బాశారు. అల్జీర్స్ సమీపంలోని బౌఫారిక్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
విమానం బౌఫారిక్ నుంచి బెచర్ లోని వైమానిక స్థావరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా సైనికులేనని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఎంతమంది మృతి చెందినది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అధికారులు తెలిపారు. విమానం కూలిన వ్యవసాయ భూముల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం మరింత తగ్గింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.