‘యమదొంగ’ విలన్ కన్నుమూత
Updated:
14-03-2018 06:02:33
ముంబై: ఛత్రపతి, యమదొంగ, లెజెండ్ సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. బుధవారం 5 గంటలకు ముంబై నానెగావ్‌లోని ఆయన ఫాం హౌస్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే రెండుసార్లు గుండెపోటుకు గురైన ఆయన బుధవారం మూడోసారి గుండెపోటు రావడంతో మృతి చెందారు. తెలుగుతోపాటు పలు హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు. మొహంజదారో, హమారీ అధూరీ కహానీ, ఘాయల్ వన్స్ అగైన్, ఫోర్స్ 2, రయీస్ , కాబిల్ వంటి హిందీ సినిమాల్లోనూ నటించారు. ప్రభాస్ నటిస్తున్న ‘సాహా’లోనూ ఆయన నటించాల్సి ఉందని సమాచారం.
నరేంద్ర ఝా మృతితో బాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైంది. సోనూసూద్, అశోక్ పండిట్ తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్లు చేశారు. మంగళవారం రాత్రి వరకు ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, రాత్రి మామూలుగా తిని తమతో చక్కగా మాట్లాడారని నరేంద్ర డ్రైవర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. బిహార్‌లోని మధుబనిలో జన్మించిన నరేంద్ర టీవీల్లోనూ నటించారు. ప్రముఖ టీవీ యాంకర్ మందిరాబేడీ ‘శాంతి’తో బుల్లితెరపై కనిపించారు.