మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం ప్రారంభం

Updated: 19-03-2018 12:35:52

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం ఉగాది పర్వదినాన ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈషా కథానాయికగా  నటిస్తున్నది. 
 
పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లు సుమంత్, ఈషాపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్‌వర్మ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఏపీ ఎంపీ జె.సి. దివాకర్‌రెడ్డి,  కథానాయకుడు రాజశేఖర్, జీవిత సంయుక్తంగా ఆవిష్కరించారు. 
 
అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ సాధారణంగా నా సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు హడావిడి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా 25వ సినిమా అని అందుకే సందడిగా ప్రారంభిస్తున్నామని నిర్మాతలు రెండు వారాల క్రితంచెప్పారు. వారు గుర్తుచేసేవరకు నాకు 25వ సినిమా అని తెలియదు. దర్శకుడు సంతోష్ రెండున్నర గంటల పాటు కథ వినిపించారు. అందులోనే సినిమా మొత్తం చూపించారు. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ జోనర్‌లో నేను సినిమా చేయడం ఇదే తొలిసారి. నాకు  ఈ తరహా కథాంశాలతో సినిమాలు చేయడమంటే చాలా భయం.  కానీ కథ నచ్చి ఈ సినిమాను అంగీకరించారు. కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతతో ఎదురుచూశాను. ఆ అనుభూతి ప్రేక్షకులకు కలిగిస్తుంది అని తెలిపారు. 
 
సుమంత్‌కు తాను వీరాభిమానని, విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఆయన సినిమాలు చేస్తుంటాచని, సుమంత్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందని చిత్ర కథానాయిక ఈషా చెప్పింది. 
 
నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ బొగ్గరం మాట్లాడుతూ సుమంత్ నటిస్తున్న 25వ సినిమా ఇది.  మాగ్నస్ సినీప్రైమ్ సహకారంతో మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధాకర్‌రెడ్డి  చక్కటి తోడ్పాటును అందిస్తున్నారు.తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని  అలరిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. 
 
దర్శకుడు సంతోష్‌జాగర్లపూడి మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఇంతకుముందు  మూడు లఘు చిత్రాలను రూపొందించాను. వాటికి సామాజిక మాధ్యమాల్లో ఇరవై ఆరు లక్షలవరకు వీక్షణలు లభించాయి. వాటికి వచ్చిన గుర్తింపును చూసి నిర్మాతలు ఈ సినిమాను రూపొందించే అవకాశమిచ్చారు. తొలుత సుమంత్‌కు సింపుల్‌గా కథను చెప్పాలని అనుకున్నాను. కానీ పాటలు, ఫైట్స్ తప్ప సినిమాలోని ప్రతి పాయింట్‌ను క్లియర్‌గా  చెప్పాలని ఆయన సూచించారు. దాదాపు రెండున్నర గంటల పాటు కథ చెప్పగానే సినిమా చేస్తానని అంగీకరించారు సుమంత్. ఏప్రిల్ మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. 
 
సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ మిస్టరీ థ్రిల్లర్ నా ఫేవరేట్ జోనర్. ఈ తరహా కథాంశాల్లో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యముంటుంది. తెలుగు చిత్రసీమలో నాకు పరిచయమైన తొలి కథానాయకుడు సుమంత్. గౌరి సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడింది. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో పనిచయడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీరం సుధాకర్‌రెడ్డి, లక్ష్మీసింధూజ, సుమత్రిపురాన తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, పబ్లిసిటీ డిజైనర్: గణేష్ పి.ఎస్.ఆర్, కో డైరెక్టర్:  రాధకృష్ణ, కాశినాథ్, క్యాస్టూమ్ డిజైనర్: సుమ త్రిపురాన, , నిర్మాతలు: ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.