నడుము నొప్పే కదా.. అని తేలిగ్గా తీసుకోవద్దు!
Updated:
24-02-2017 09:20:07
సిడ్నీ: నడుము నొప్పితో బాదపడుతున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే. ప్రపంచంలో సర్వసాధారణ సమస్య ఏదైనా ఉందా..? అంటే అది నడుమునొప్పే. ఎంతో మందిని వేధిస్తున్న మహమ్మారి ఇది. ఇదంతా అందరికీ తెలిసిందే.. కానీ, నడుము నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దని తాజా అద్యయనం చెబుతోంది. వెన్నునొప్పి ఉన్న వాళ్లు త్వరగా మరణించే ముప్పు 13 శాతం ఎక్కువని తేల్చింది. వెన్నునొప్పితో బాధపడే వృద్ధులకు, ముందస్తు మరణాలకు మధ్య సంబందంపై కొందరు పరిశోధకులు ఇప్పటికే అధ్యయనాలు చేశారు. అయితే తాజాగా సిడ్నీ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 70 ఏళ్ల వయస్సున్న 4360 కవలలపై ఈ అధ్యయనం చేశారు. నడుము నొప్పికి సరైన చికిత్స తీసుకోకపోవడం, సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల జీవితకాలం తగ్గిపోతున్నట్లు గుర్తించామని అధ్యయనకర్త పాలో ఫెర్రెరియా తెలిపారు. సాధారణ వ్యక్తులతో పొల్చితే నడుమునొప్పి ఉన్నవారిలో ముందస్తు మరణాల ముప్పు 13 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అదేసమయంలో నడుము నొప్పికి చికిత్సలో పెయిన్‌కిల్లర్స్ వల్ల ఉపయోగం ఉండడం లేదని, పైగా వాటివల్ల ఆరోగ్యానికి ముప్పే ఎక్కువని చెప్పారు. సరైన చికిత్స తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల నడుమునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. మొత్తంమీద నడుమునొప్పిని తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమేనన్నమాట!