మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

మ‌హేశ్ అన్న మాకు ఇన్‌స్పిరేష‌న్‌!- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌

Updated: 08-04-2018 02:30:43

`భ‌ర‌త్ అనే నేను` మైల్ స్టోన్ మూవీ అవుతుంది- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌
 
సూపర్‌స్టార్‌ మహేశ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంప దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా బ‌హిరంగ స‌భ హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులతో ఎల్‌.బి.స్టేడియం కిక్కిరిసిపోయింది. భారీ అభిమాన సందోహం మధ్య జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ మేకింగ్‌ ఏవీని విడుదల చేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. 
 
ఈత‌రంలో ఆయ‌న చేయ‌ని ఎక్స్‌పెరిమెంట్ మూవీ లేదు-యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ 
 
 
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మా ఇద్దరినీ ఒకే వేదికపై చూడటం అభిమానులకు కొత్తేమో కానీ.. నాకు, ఆయనకు కొత్తేమీ కాదు. అందరూ ఆయన్ను ప్రిన్స్‌ అని.. సూపర్‌స్టార్‌ అని అంటుంటారు. నేను ఆయన్ని మహేశ్‌ అన్నా! అంటాను. ఈరోజు మహేశ్‌ అన్న ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ సినిమా అద్భుతమైన సినిమాను సాధించాలని.. అభిమానుల భాషలో రికార్డులు తిరగ రాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా కోరుకుంటున్నాను. మహేశ్‌ అన్న నటుడిగా ఆయన స్థాయి గురించి, స్టామినా గురించి నేను మాట్లాడను. నేను చెప్పే విషయం ఒకటే.. ఒక కమర్షియల్‌ హీరో అయినా ఆయన చేసినన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌ ఎవరూ చేయలేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా అదే బాటలో.. మాటపై నిలబడి ఆయన చేసిన సినిమాలు మేం చేయలేదు. ఇప్పుడిప్పుడే మేం మొదలు పెడుతున్నాం. అందుకు ఇన్‌స్పిరేషన్‌ ఆయనే. జనతాగ్యారేజ్‌లో అరుదైన మొక్క గురించి చెబుతూ 'చాలా అరుదైన రకం దాన్ని అలాగే ఉండనిద్దాం' అని శివగారు డైలాగ్‌ రాశారు. అలా మహేశ్‌ అన్న అరుదైన రకం.. ఆయన్ను అలాగే ఉండనిద్దాం. భరత్‌ అనే నేను ఆయన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. శివ నా ఆప్తమిత్రుడు, మంచి కోరేవాడు. ఆయనతో బృందావనం నుండి ట్రావెల్‌ చేస్తున్నాను. సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి... దర్శకుడు. సినిమాను సినిమాలాగానే కాకుండా.. కమర్షియల్‌ పంథాను తగ్గకుండా మసాలాలు దట్టించి.. ఒక పౌరుడుగా ఆయన ఇవ్వాలనుకుంటున్న సందేశాన్ని ఇస్తుంటారు. ఎప్పటికీ ఆయన ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సమాజం పట్ల ఆయన బాధ్యతను ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. అలాగే దానయ్యగారికి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి..ఆయన బ్యానర్‌కి మంచి పేరుని తేవాలి. దేవిశ్రీకి ఆల్‌ది బెస్ట్‌. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 
 
 
ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్స్‌ రవి.కె.చంద్రన్‌, తిరునావ్‌కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేశ్‌, తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.