మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

శ్రీనివాసాచారికి ‘బెస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

Updated: 09-09-2017 09:58:12

హైదరాబాద్: మహారాష్ట్ర పూణెలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ‘మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ గవర్నమెంట్’(ఎ.పీ.జీ) కోర్సు 2016-17 ఫలితాలలో హైదరాబాద్‌కు చెందిన వంగీపురం శ్రీనివాసాచారి అత్యుత్తమ ప్రతిభ కనబరచి ‘బెస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సాధించారు. సెప్టెంబర్ 7 గురవారం స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అధికారులు పూణెలో మహారాష్ట్ర ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వరల్డ్ పీస్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవా గవర్నర్ మృదుల సిన్హా.. శ్రీనివాసాచారికి అవార్డుతోపాటు బంగారు పతకాన్ని బహుకరించారు.
 
ఆసియా ఖండంలో పొలిటికల్ లీడర్‌షిప్ రంగంలో ఒక సంవత్సరం పూర్తికాలపు అకడమిక్ కోర్సునందించే ఏకైక సంస్థ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ మాస్టర్స్ ప్రొగ్రామ్ ఇన్ గవర్న్‌మెంట్ 12వ బ్యాచ్‌లో తెలంగాణ రాష్ట్ర నుంచి శ్రీనివాసాచారి ఒక్కడే కోర్సుకు ఎంపికయ్యారు. కోర్సులో భాగంగా నిర్వహించిన వివిధ ప్రజెంటేషన్స్, అసైన్‌మెంట్స్, మాడ్యూల్ అండ్ ఎగ్జామినేషన్స్, ట్రైమెస్టర్ అండ్ ఎగ్జామినేషన్స్, ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టులలో శ్రీనివాసాచారి ప్రథముడిగా నిలిచి అంతిమంగా ‘బెస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నారు.
 
2016-17 ఎంపీజీ బ్యాచ్‌లో మనదేశంలోని 11 వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశం లభించింది. కోర్సు కాలంలో శ్రద్ధాసక్తులతో పొలిటికల్ లీడర్‌షిప్‌ను అధ్యయనం చేసిన శ్రీనివాసాచారి ప్రతిభను స్కూల్ ఆఫ్ గవర్న్‌మెంట్ అధికారులు ప్రత్యేకంగా గుర్తించారు. ఆయనకు మోడల్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి పాత్రను పోషించే అవకాశాన్నిచ్చారు. మొట్టమొదటి నేషనల్ టీచర్స్ కాంగ్రెస్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి ఉపన్యసించడానికి ఎంపిక చేశారు. వారి అంచనాలకు తగినట్టుగా ఆయన తన ప్రతిభను నిరూపించుకుంటూ కోర్సును పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. బోధన, శిక్షణ, పరిపాలన రంగాలలో విశేష అనుభవమున్న శ్రీనివాసాచారి వేర్వేరు అంశాలను విశ్లేషిస్తూ రాసిన వివిధ వ్యాసాలు పలు పత్రికలలో ప్రచురితమయ్యియి. టెలివిజన్ చర్చలలోనూ ఆయన పాల్గొన్నారు. అరుదైన విశిష్టత గల స్కూల్ ఆఫ్ గవర్న్‌మెంట్‌లో అవార్డును సాధించిన వంగీపురం శ్రీనివాసాచారి స్వగ్రామం నార్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరు. కృతనిశ్చయంతో పొలిటికల్ లీడర్‌షిప్ నైపుణ్యాలను అధ్యయనం చేసిన తన శ్రమ ఫలించి ‘బెస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతోపాటు, బంగారు పతకం దక్కడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తన అవార్డు ద్వారా స్కూల్ ఆఫ్ గవర్న్‌మెంట్‌లో రాష్ట్రానికి గుర్తింపు రావడం ఇంకా సంతోషంగా ఉందని శ్రీనివాసాచారి తెలిపారు

 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.