మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

కేరళ స్కూలు వినూత్న నిర్ణయం.. విద్యార్థుల బ్యాగులు మోసేందుకు ప్రత్యేక బస్సు!

Updated: 15-06-2017 07:05:04

కన్నూరు(కేరళ): భుజాన బండెడు బరువున్న పుస్తకాల బ్యాగుతో నడుం వంగిపోయేలా నడుస్తూ స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులకు కేరళ స్కూలు ఉపశమనం కలిగించే శుభవార్త చెప్పింది.  స్కూలు సమీపంలోని విద్యార్థులు స్కూలు బ్యాగులు మోసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేసింది. నిర్దేశించి పాయింట్లలో బ్యాగులను కలెక్ట్ చేసుకున్న బస్సు తిరిగి వాటిని స్కూల్లో అప్పజెబుతుంది. దీని వల్ల విద్యార్థులు హాయిగా స్కూలుకు నడుచుకుంటూ రావచ్చని, బరువును మోస్తూ ఆపసోపాలు పడి స్కూలుకు వచ్చే బాధ తప్పుతుందని కన్నూరులోని కట్టంపల్లిలో ఉన్న జీఎం అప్పర్ ప్రైమరీ స్కూలు యాజమాన్యం తెలిపింది.
 
ఆర్థిక కారణాలతో స్కూలు బస్సును వినియోగించుకోలేని వారి కోసమే ఈ అవకాన్ని కల్పించినట్టు పేర్కొంది. 300 మంది విద్యార్థులకు దీని వల్ల ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. భుజానికి బ్యాగు లేకుండా రావడం చాలా హ్యాపీగా ఉందని విద్యార్థులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని స్కూలు ఉచితంగానే అందిస్తున్నా మున్ముందు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.15-20 వసూలు చేయాలని భావిస్తోంది. అది కూడా నిర్వహణ చార్జీలకు మాత్రమేనని చెబుతోంది. ఏది ఏమైనా ఈ స్కూలు తీసుకున్న నిర్ణయం పలు స్కూళ్లకు స్ఫూర్తిగా మారుతుందనడంలో సందేహం లేదు. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.